Sunday, June 21, 2020

దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?

దైవాన్ని ఆరాధిస్తున్నా నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి?






పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం , అజ్ఞాత వాసాలు చేయడంలో అంతర్యం ఏంటి? ఈ ప్రశ్న ప్రతిఒక్కరు వేసుకోవలసినది..




1. పాండవులు మాయజూదంలో కౌరవుల చేతిలో ఓడిపోయి రాజ్యాన్ని కోల్పోయి అడవులపాలు అయ్యారని అందరికి తెలిసిందే. అరణ్యవాస చేస్తూ ఉండగా ఒకనాడు శ్రీకృష్ణుడు సత్యభామ సహితంగా పాండవులను కలుసుకోవడానికి వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడిని ధర్మరాజు "జూదం ఆడేటప్పుడు మమ్మల్ని ఎందుకు కాపాడలేదు" అని ప్రశ్నిస్తాడు. అందుకు సమాధానంగా కృష్ణుడు "నేను ఆ రోజు అక్కడలేను, సాల్వుడు అనే రాజుతో మాయ యుద్ధం చేస్తున్నాను (6 నెలల పాటు ఆ యుద్ధం జరిగింది!) నాకు కానీ ఆ విషయం తెలిసుంటే అలా జరగనిచ్చేవాడిని కాను" అన్నాడు. (ఆ సర్వాంతర్యామికి జూదం సంగతి తెలియదంటారా)?.




అసలు ఈ పాండవులు , శ్రీకృష్ణుడు వచ్చిందే భూమి మీద దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం. కానీ పాండవులు మానవులు కావడం చేత శక్తులు కానీ, కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించడానికి సరైన ఆయుధాలు కానీ, ఏమీలేవు. ఉన్నది ఒక్కటే 'ధర్మం'.. అరణ్యవాసం అజ్ఞాత వాసంలో వీళ్ళని నిలబెట్టింది ధర్మమే. కాని అలాగే కొనసాగితే ధర్మం పేరుతో బ్రష్టులు అయిపోతారు. ధర్మాన్ని అన్ని కోణాల్లో ప్రయోగించాలి. ఆలా చేయాలంటే బలం, బలగం, ఆయుధ సంపత్తి, అస్త్ర శాస్త్రాలు, దైవబలం మెండుగా ఉండాలి. కాని ఆడిన మాట కోసం అడవుల పాలైన పాండవులు రాబోయే కురుక్షేత్ర మహా సంగ్రామంలో గెలవడం ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అసాధ్యం. అందుకే శ్రీకృష్ణుడు తన మాయని ప్రదర్శించాడు. తాత్కాలిక కృష్ణమాయ కల్పించాడు.




వస్త్రాపహరణం సమయంలో ద్రౌపతి శ్రీకృష్ణ స్మరణ చేయగానే వచ్చి వస్త్రాలు ఇచ్చాడు. మరి అక్కడే ఉన్న ధర్మరాజు  అదంతా చూసికూడా శ్రీకృష్ణుడిని తలచుకోలేకపోయాడు!(ఇదే మాయ అంటే).




అటు పక్క భీష్ముడు లాంటి యోధుడు (21సార్లు క్షత్రియులు మీదకి దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలం చేసిన దీరోధత్తుడు, పరశురాముడిని ఓడించిన మహావీరుడు), పరశురాముడి వద్ద శిష్యరికం చేసి కౌరవుల పాండవులకు శిక్షణ ఇచ్చిన వీరాధి వీరుడు ఎలాంటి అస్త్ర శాస్త్రాలనైనా అలవోకగా ఎదుర్కోగల ద్రోణుడు ఒకప్రక్క.  పుట్టుకతోనే కవచంతో పుట్టిన కర్ణుడు(ఈ కవచాన్ని బెదించాలంటే మానవమాత్రుడి వల్ల కాదు! దైవబలం పుష్కలంగా ఉండాలి). కపటి శకుని, పుత్రప్రేమతో తపించిపోయే దృతరాష్ట్రుడు, అన్నకోసం దేనికైనా తెగించే దుశ్శాసనుడు వీళ్ళు ఒక పక్క.




ఇంతటి వీరులైన వీరందరిని ఓడించాలి. వీరికి సామంతులు మహాబలవంతులు. వీరిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాలంటే వీళ్ళకి ఇప్పుడు ఉన్న శక్తి చాలదు. కనుక వీరిని పుటం పెట్టిన బంగారంలా, సానబెట్టిన వజ్రంలా తయారుచేసి శత్రువుల మీదకి సాధించాలి. అప్పుడే విజయం వరిస్తుంది. అందుకే మనకి పైకి శ్రీకృష్ణుడు తోడు ఉన్నా పాండవులు అడవుల పాలయ్యారు. కౌరవులు సుఖపడ్డారు అనుకునేలా కనబడుతుంది. లోక రక్షణ కోసం తాత్కాలిక కష్టాలు అనుభవించినా భవిష్యత్తు బావుంటుంది కనుక దుష్టశిక్షణ జరుగుతుంది కనుక పాండవులు అడవులలో తిరుగాడవలసి వచ్చింది.




2. జూదంలో ఒడి అడవులపాలు అయ్యారు.  అసలు ఇక్కడ జరిగింది వేరు. వీళ్ళని అడవులకి పంపించాము ఇక తిరుగులేదు అని దుష్టచతుష్టయం అనుకుంది. భోగాల్లో మునిగి తేలారు. ఆయుధ సంపత్తి పెంచుకోవడం కానీ, అస్త్రశస్త్రాలు సాధిచడం కానీ ఏమి చేయకపోగా ఋషులు వచ్చినప్పుడు దుర్యోధనుడు అహంకారంతో అగౌరవపరచి శాపాలు పెంచుకున్నాడు. అడవుల్లో పాండవులని శ్రీకృష్ణుడు ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. పాండవుల క్షేమం కోసం  ఎప్పటికప్పుడు మునులని, ఋషులని, ఎవరిని చూస్తే జన్మ చరితార్ధం అవుతుందో అలాంటి మార్కండేయ మహర్షిని పంపించి జ్ఞానాన్ని ప్రసాదించి, ఎన్నో శక్తులని అందిపుచ్చుకునేల చేశాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడి ప్రేరేపణతో శివుడి కోసం తపస్సు చేస్తున్న అర్జునుడికి సాక్షాత్తు శివుడే కిరాత రూపంలో వచ్చి అర్జునుడితో తలపడ్డాడు.




అర్జునుడు వేస్తున్న బాణాలు వేసినట్లు వేసినట్లు మాయమవుతున్నాయి. చివరికి అమ్ములపొద కూడా మాయమయింది. అయినా కూడా వచ్చింది ఎవరో గ్రహించకుండా విల్లుతో మీదికి దూకాడు. విల్లు మాయమయింది. అర్జునుడు శివుడిని పిడిగుద్దులు గుద్దాడు. శివుడు నవ్వుకొని ఒక్క పిడికిటి పోటు పొడవడంతో మూర్చిల్లి కిందపడ్డాడు. తెప్పరిల్లిన తరువాత చూస్తే ఇంకేముంది! కిరాతుల రూపంలో ఉన్న శివపార్వతులు అసలు రూపంలో దర్శనం ఇచ్చారు. పాశుపతాస్త్రం అందించారు. ఆవిధంగా అర్జునుడు పాశుపతాస్త్రం సంపాదించాడు. శివా! ఎందుకు నన్ను ఇలా ఆట పట్టించావ్? అని అడిగితె! అర్జునుడు శివుడుని తాకి కలబడటం వల్ల శరీరం వజ్రకవచంలా తయారయ్యింది (ఇదొక వరం). దానికితోడు పాశుపతాస్త్రం వచ్చింది.




తదనంతరం ఇంద్రుడు వచ్చి స్వర్గలోకానికి తీసుకెళతాడు. అక్కడ అనుకోని సంఘటన వలన ఊర్వశి చేత స్వర్గలోకంలో పేడి (నపుంసకుడు) అవుతావు అని శాపం పొందుతాడు. ఇది అంతా గమనించిన ఇంద్రుడు అర్జునుడి సత్యనిష్ఠ కి సంతసించి ఊర్వశి ఇచ్చిన శాపాన్ని ఇంద్రుడు వరంగా తిప్పాడు. దీనికి తోడు ఇంద్రుడు అర్జునుడికి




నాట్యం శిక్షణ ఇస్తాడు. ఈ శాపం అజ్ఞాత వాసంలో వరంగా మారింది. నృత్యం వలన విరాట కొలువులో విరాటుడి కుమార్తె ఉత్తరకి నాట్యశిక్షణ కోసం ఉపయోగపడింది. ధర్మరాజు జ్ఞానాన్ని, తప్పస్సుని పెంచుకుంటే, అర్జునుడు ఆయుధ సంపత్తిని పెంచుకున్నాడు. భీముడు గురించి చెప్ప పనిలేదు. భీముడు హిమగిరులలో విహరిస్తుండగా పుష్పం కోసం బయలుదేరి ఇలా అరణ్య అజ్ఞాత వాసాలు ముగించి ఆయుధ సంపత్తిని, ఎనలేని కీర్తి గడించారు.




ఇప్పడు అసలు విషయంలోకి వద్దాం!




 ప్రతి మనిషి జీవితంలో గడ్డుకాలం ఉంటుంది. ఏపని చేసినా కలిసిరావడంలేదు అని వాపోతారు. దేవుడుని నిందిస్తారు. నేను ఎం పాపం చేశాను! ఎందుకు నాకు ఈ శిక్ష అని లోకంలో కష్టాలన్నీ వీళ్ళకే వచ్చినట్లు బాధపడుతూ ఉంటారు. ఆ సమయంలో మునుపు పనికిమాలిన పనులు గుర్తుండవు. గుర్తురావు. పైగా కష్టాలలో ఉండడం చేత ఎక్కడ సాయం అడుగుతారో అని పలకరించడానికి కూడా ఎవరు రారు. అప్పుడు మనం చేసే ఆలోచన ఎలా ఉంటుందంటే నాకు ఎవరులేరు. నాబ్రతుకు ఇంతే! ఇంకేమి సాధించలేను మరణమే శరణ్యం అనే ఆలోచనల్లోకి వెళ్ళిపోతారు. ఇది ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది.




 దీన్నే మనం అరణ్యవాసం అనుకోవాలి. ఆ సమయంలో ఎవరులేరని భాధపడకూడదు. ఎందుకంటే ఎవరు లేకపోతేనే తపస్సు చేయడానికి మంచి అవకాశం. ఎందుకంటే ఇంతకుముందు అన్ని ఉన్నాయి. అందరూ ఉన్నారు. అప్పుడు ఈ ఆలోచన రాలేదు. ఇప్పుడు కష్టంలో ఉన్నారు. ఇప్పుడు ఎవరూ రారు. రారు అని నింద వేసి ఏడుస్తూ కూర్చుంటే ఇంకా మీరు సాధించేది ఏమిటి? ఒకవేళ వస్తే సాధన చేస్తారా? చేయరు.  (ఒకటి ఆలోచించండి! పాండవులు అరణ్యవాసం చేయకపోతే కురుక్షేత్రం జరిగేది కాదు. ఎల్లప్పుడూ రాజ్యం కోసం ఎత్తులు, పై ఎత్తులు వేస్తూ, యజ్ఞాలు యాగాలు అంటూ వీటితోనే కాలం గడిచేది. దుష్టశిక్షణ జరిగేది కాదు. మహాభారతం మనకి దొరికేది కాదు..




వాళ్ళుకూడా చరిత్రలో కలిసిపొయెవారె!).. అలాగే మనం కూడా కష్టం అనే గడ్డు కాలాన్ని గ్రంధ పఠనం అనే తపస్సు చేసి జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే ఏదైనా విద్యలని అభ్యసించాలి. సరైన గురువు కోసం అన్వేషించాలి! అప్పుడు తెలుస్తుంది జీవితం ఎలా సరిదిద్దుకోవాలో. కష్టం వచ్చినప్పుడు ఎలా నిలబడాలో!




ఒక రకంగా చెప్పాలంటే సుఖపడుతున్నాం అంటే పుణ్యం కరిగిపోతున్నట్టు. కష్టపడుతున్నాం అంటే పాపం కరిగిపోతున్నట్టు. ఇప్పడు ఆలోచించుకోండి!




సుఖాలలో ఉన్నప్పుడు కూడా కష్టపడుతూ పుణ్యాన్ని డిపాజిట్ చేసుకుంటారా! కష్టాలలో కూడా సుఖాల కోసం వెంపర్లాడుతూ కష్టాలు కొనితెచ్చుకుంటారా! సుఖపడుతున్నప్పుడు దానధర్మాలు చేయాలి. యజ్ఞయాగాదులు (రోజుకు ఒక పేజి అయినా గ్రంధ పటనం చేస్తుంటే అదే కలియుగంలో  యజ్ఞం) చేయాలి. అప్పుడు కష్టాలు మీదగ్గరికి రావు సరికదా. మీకు ప్రమాదం కలిగించాలి అనుకున్నవారు మీ చుట్టూ ఉన్నా అనతికాలంలోనే వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక మార్గం వైపు మీరు ఒక అడుగు వేశారు కనుక ఆదైవం ఎప్పుడు మీ పక్కనే ఉంటాడు. భగవంతుడు మీప్రక్కనే ఉన్నట్లు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు కష్టం వచ్చిందంటే దానికి ఎదో కారణం ఉంటుంది. శ్రీకృష్ణుడు తోడు ఉండి కూడా పాండవులు అరణ్యవాసం చేసినట్లు.. కనుక ఎప్పుడూ దేనికి బెదిరిపోవద్దు. కృంగిపోవద్దు.

Friday, June 5, 2020

🌹. అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం: 🌹

లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగ హరం దివ్యం సర్వ సంపత్కరం శుభం.

Tuesday, June 2, 2020

పంచారామ క్షేత్రాలు












పంచారామ క్షేత్రాలు-1
ద్రాక్షారామము:
దర్శనం ఉదయం 6:00 నుంచి 12:00 గంటలు తిరిగి సాయంత్రం 3:00 నుంచి రాత్రి 8:00 గంటలు వరకు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు 30 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఉంది. ఇది పుణ్య క్షేత్రం మరియు పంచారామాల్లో ఒకటి. ఈ ప్రదేశం గోదావరి నది ఒడ్డున ఉన్నది. ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ ... క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం ద్రాక్షారామం లేదా దక్షారామం . దక్ష ప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది.
పౌరాణిక గాధలు తారాకాసురుని కంఠంలో అమృత లింగం వుందేది. అది వుండగా అతన్ని జయించలేరని దానిని ఛిన్నం చేయడానికి దేవతలు కుమారస్వామిని ప్రార్ధించారు. కుమారస్వామి దెబ్బకు అది 5 ముక్కలైంది. ఒకటి ద్రాక్షారామంలో, రెండవది అమరారామం [అమరావతి] లో, మూడవది క్షిరారామం [పాలకొల్లు] లో, నాలుగవది సోమారామం [గుణుపూడి, భీమవరం] లో , అయిదవది కుమారారామం [సామర్లకోట దగ్గరగల భీమవరం] లో పడ్డయట. పూర్వం దక్షప్రజాపతి నివసించిన ప్రదేశం ఇది. అందుకే దక్షారామం అయింది. అలాగే ద్రాక్ష తోటలు ఎక్కువ వుండేవి, అందుకని ద్రాక్షారామం అన్నారు.
గుడి లోపలి ప్రాంగణంలో వీరముడి ఆంజనేయ స్వామి విగ్రహం వుంది. ఈయనకి జుట్టు ముడి వేసి కొప్పులాగా వుంటుంది. అందుకే ఆ పేరు. గద లేదు. నమస్కార ముద్రలో వుంటాడు. తుష్కరులు ఈ విగ్రహం కాళ్ళ దగ్గర కొట్టేశారు. ప్రక్కనే ఒకే పానువట్టంమీద 108 చిన్న చిన్న శివ లింగాలు వుంటాయి. దాన్ని దర్శిస్తే అన్ని శివాలయాలూ చూసినంత ఫలమట. ఇక్కడ నవగ్రహ మండపమే కాక అష్ట దిక్పాలకులకూ మండపం వుంది. బహుశా దీన్ని ఇక్కడే చూస్తామేమో.
ఏకశిలలో మలచిన నమూనా దేవాలయం ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. అష్టదిక్పాల మండపానికి ఎదురుగా వున్న స్వామి ప్రధాన ఆలయ మార్గాన్ని చీకటికోణం అని పిలుస్తారు. ఇందులో మూడు ప్రాకారాలున్నాయి. అందులో మొదటి రెండు ప్రాకారాలలో గోడలకి బొడిపలు కనబడతాయి. పూర్వం అక్కడ నవరత్నాలు పొదగబడి వుండటంవల్ల ఆ ప్రదేశమంతా కాంతిమయంగా వుండేదట. నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.
రెండు అంతస్తులలో 60 అడుగుల ఎత్తులో స్వామి వారి శివలింగం సగం తెలుపు, సగం నలుపు రంగులో ఉంటుంది. రెండో అంతస్తు పై భాగం నుంచి అర్చకులు, భక్తులు అభిషేకాలు నిర్వహిస్తారు. ఇక్కడి స్వామి వారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన మాణిక్యాంబ అమ్మవారు స్వామి వారితో కలిసి కొలువై ఉండడం విశేషం. భారతదేశంలోని అత్యంత అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి.
అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ దేవాలయాన్ని సందర్శించడం ప్రతి ఒక్కరికీ ఓ మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. క్రీస్తు శకం 892-922 మధ్య చాళుక్యుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. కార్తీక మాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది.
సర్వేజనా సుఖినోభవంతు

Monday, June 1, 2020

దీపారాధన - వాటి ఫలితాలు

సాయంత్రం దీపం స్నానం చేసి వెలిగించాలా అని చాలా మంది స్త్రీలకు కలిగే అనుమానం.
గృహిణికి ఉదయంపూట స్నానం మాత్రమే ధర్మం చెప్తోంది.
సూర్యాస్తమయానికి 48 నిమిషాల కంటే ప్రారంభ సమయంలో అంటే పూర్తిగా చీకటి పడదు ఇంకా. వెలుతురుగా ఉంటుంది. ఆ సమయంలో కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కొని ముఖం కడుక్కొని మళ్ళీ బొట్టుపెట్టుకొని ఉదయం నుంచి ధరించిన వస్త్రములు విడిచి ఉతికిన వస్త్రములు ధరించి దేవతా గృహంలోకి వెళ్ళి తైలంతో దీపారాధన చేయాలి.
ఆ పిమ్మట శ్లోకములు ఏమైనా తెలిసి ఉంటే చెప్పుకోవాలి. ఇంటిల్లిపాది ఒక చోట కూర్చొని పిల్లలను కూర్చోబెట్టుకొని శ్లోకములు, పద్యములు, దండకములు చెప్పించాలి.
ఇలా ఈ సమయాన్ని మనం గడిపితే అది దీపారాధన చేసినట్లు. దీపాన్ని వెలిగించడం ఒకటి. దీపాన్ని ఆరాధన చేయడం రెండు.
“దేవీం షోడశవర్షీయాం శశత్సుస్థిర యౌవనాం!
బింబోష్ఠీం సుదతీమ్ శుద్ధామ్ శరత్ పద్మ నిభాననామ్!!
శ్వేతచంపక వర్ణాభాం సునీలోత్పల లోచనామ్!
జగద్ధాత్రిమ్ చ ధాత్రిమ్ చ సర్వేభ్య సర్వ సంపదామ్!!
సంసార సాగరే ఘోరే జ్యోతీరూపాం సదా భజే!

ఇది జ్యోతి కాంతులను మనం ఆరాధన చేసేసమయంలో మనం చెప్పవలసిన శ్లోకము, స్తోత్రము.
కాబట్టి సాయంత్రం వేళల వెలిగించేటటువంటి దీపారాధనకు పూర్వం మళ్ళీ స్నానం చేసే అవసరం లేదు.
🔹దీపారాధనకి వినియోగించే వివిధ వత్తులు- వాటి ఫలితాలు -

🔹 ప్రత్తివత్తుల దీపారాధన:
దైవభక్తి వృద్ది అగును. పితృదేవతాదోషాలు తొలగును.

🔹 అరటినార వత్తుల దీపారాధన:
కుటుంబశాంతి, మంచి సంతానం, కులదైవం అనుగ్రహం కలుగుతుంది. -

🔹 తామరతూడు వత్తుల దీపారాధన:
ఋణబాధలు తొలగి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. సిరిసంపదలు కలిగి శ్రేయెస్సు కలుగుతుంది. -

🔹 జిల్లేడు వత్తుల దీపారాధన :
విఘ్ణేశ్వరుని అనుగ్రహం లభించి. దుష్టశక్తుల పీడ నివారణ మౌతుంది. సిరిసంపదలతో తులతూగుతారు. -
🔹 పసుపు నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తుల దీపారాధన: అమ్మ కటాక్షం, జఠర, ఉదరసంబంధ వ్యాధుల నివారణ కలుగుతుంది. కామెర్లు త్వరగా తగ్గు ముఖం పడుతుంది.

🔹 కుంకుమ నీటితో తడిపిన క్రొత్త బట్టవత్తులు దీపారాధన:
దైవానుగ్రహం కల్గి వివాహ ఆలస్యసమస్యలు, వైవాహిక సమస్యలు, సంతానలేమి సమస్యలు ప్రయోగించబడిన మాంత్రిక శక్తులు తొలగిపోతాయి. మంచి సంతానం కల్గుతుంది.

🔹 పన్నీరు అద్దిన వత్తులను నేతితో దీపారాధన:
లక్ష్మీదేవి అనుగ్రహం సిరిసంపదలు కీర్తి ప్రతిష్టలు కల్గుతాయి.

ఓం నమో లక్ష్మీ నారాయణాయా

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు!

ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు!
ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారని శాస్త్ర వచనం.
1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.
2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.
3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.
4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.
5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.
6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.
7 . సర్వప్రపంచం చేత సేవించ బడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.
8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.
9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.
10 . నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.
11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.
12 ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇలను అందజేస్తుంది.
సర్వే జనాః సుఖినో భవంతు
🙏ఓం నమఃశివాయ 🙏